గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నవారికి నిర్వహించే రాత పరీక్షల కాలపట్టిక (షెడ్యూల్)ని మంగళవారం ప్రకటిస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒకే అభ్యర్థి రెండు, మూడు పరీక్షలు రాసే వీలున్నందన్న, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసకుంటామని పేర్కొన్నారు. పంచాయితీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లతోనూ చర్చిస్తున్నామని చెప్పారు. కేటగిరి రెండు, మూడులో ఉద్యోగాలకు ప్రశ్నపత్రాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిసి ముద్రించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కష్టం కాబట్టి తప్పులు దొర్లే అవకాశాలుంటాయన్నారు. ఏపీపీఎస్సీ, యూపీపీఎస్సీ రూపొందిస్తున్న ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తామన్నారు. పదో తరగతికి ముందు ఏడేళ్ల కాలంలో ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అదే అభ్యర్థి జిల్లా స్థానికత (లోకల్) అవుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. అన్ని పోస్టులకూ కలిపి ఇంతవరకు 10.60 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని పేర్కొన్నారు. సందేహ నివృత్తి కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు రోజూ పెద్దఎత్తున అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారని ఆయన వివరించారు.
ఇదీ చదవండి :