ఉన్నత చదువుకోగానే అందరూ ఉద్యోగాల కోసం పరుగుపెడతారు. ఎక్కడెక్కడో తిరుగుతారు. విజయవాడ యువకుడు ఆ పని చేయలేదు. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేశాడు. యశ్వంత్ ఆస్ట్రేలియాలో ఎనర్జీ ఎఫిషియన్సీ పై ఎంఎస్ పూర్తి చేశారు. ప్రతిభ నిరూపించుకునేందుకు నూతనంగా ఏదైనా చేయాలనుకున్నారు. మరో 10 మందితో కలిసి కృష్పా డెవలప్ మెంట్స్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు సాంకేతికత జోడించి యాప్ రూపొందించారు. మై స్లాట్స్ పేరుతో అప్లికేషన్ డెవలప్ చేశారు.
కరోనా పాటిజివ్ వచ్చిన వారిని గుర్తించటమే కాదు... వారి కాంటాక్ట్స్ పసిగట్టడం ఓ ప్రహసనంగా మారింది. పాజిటివ్ కాంటాక్ట్స్ వెంటనే గుర్తించేందుకు, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు మై స్లాట్ అనే యాప్ ఉపయోగపడుతుందని యశ్వంత్ చెపుతున్నారు.
షాపింగ్ మాల్ లోనికి వెళ్లేముందు మై స్లాట్ యాప్ నుంచి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. మీరు ఉన్న ప్రదేశంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఉన్నారా? లేరా ? మీరు రెడ్ జోన్ లో ఉన్నారా? గ్రీన్ జోన్ లో ఉన్నారా? అని తెలిసిపోతుందని యశ్వంత్ చెపుతున్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత షాపింగ్ మాల్ యజమానికి వినియోగదారుని పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ తెలుస్తుంది.
మై స్లాట్స్ సర్వర్ కు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలు అనుసంధానం చేస్తే వెంటనే వినియోగదారునికి అలర్ట్ వస్తుంది. అక్కడ నుంచి వెళ్లిన తర్వాత వినియోగదారునికి కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ వస్తే వైద్య ఆరోగ్య శాఖకు ఆన్ లైన్ వివరాలు వెళతాయి. ఆ డేటా మై స్లాట్ యాప్ తో అనుసంధానం అయి ఉంటే వెంటనే వినియోగదారుడు ఎక్కడెక్కడు వెళ్లాడో ఆ షాపింగ్ మాల్ యజమానులకు అలర్ట్ వెళ్తుంది. అధికారులకు తెలిసిపోతుందని యశ్వంత్ చెపుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి నియంత్రించవచ్చని అంటున్నారు.
- ప్రభుత్వం ప్రోత్సహిస్తే...
మై స్లాట్ యాప్ తయారీకి పది మంది నెలన్నర పాటు కష్టపడ్డాం.. మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాం... ప్రభుత్వం తమకు ప్రోత్సాహం ఇస్తే ముందుగా కరోనా కట్టడి ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించి మంచి ఫలితాలు రాబట్టవచ్చు.. - యశ్వంత్ , యాప్ రూపకర్త
ఇదీ చదవండి: భూ వివాదం: కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు