రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు, ఇతర ఆన్లైన్ సేవలకు వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, ఇతర ఆలయాల్లో ఆన్లైన్ సేవలను... కొందరు నకిలీ వెబ్సైట్ల ద్వారా నిర్వహిస్తున్నారని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగిని ఈవో చంద్రశేఖర్‌రెడ్డి సస్పెండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు విని మోసపోవద్దంటూ భక్తులకు ఈవో సూచించారు. ఈ కేసును విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దుర్గగుడి నకిలీ వెబ్‌సైట్‌పై సీపీకి ఫిర్యాదు
విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం పేరుతో నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్నారని దుర్గగుడి ఈవో సురేష్ కుమార్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు మొత్తం మూడు రకాల వెబ్సైట్లు అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇవి ఎవరు నిర్వహిస్తున్నారనేది ఇంకా తేలలేదు. ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకు అప్పగించినట్లు సీపీ తెలిపారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు దేవాలయ సొత్తును దోచుకుంటున్నారా..? లేక విరాళాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారా..? అనే కోణంలో విచారిస్తున్నామని సీపీ వివరించారు.
ఇదీ చూడండి: