రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ సచివాలయంలో సమావేశమయ్యారు. గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య ఘటనకు సంబంధించి వివిధ అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. హత్యకు దారితీసిన ఘటనతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా కమిషన్ ఆరా తీసింది.
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం,రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీఎస్ ఆదిత్యనాథ్ ఎస్సీ కమిషన్కు వివరించారు. రమ్య హత్య ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం త్వరితగతిన స్పందించి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచిందని చెప్పారు. దిశ యాప్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు శాఖ యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలు సేకరించి కేసు వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల భద్రతకు అన్ని విధాలా భరోసా కల్పిస్తున్నట్లు డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీస్ సేవా యాప్ ద్వారా గడచిన 10 మాసాల్లో 7 లక్షల 4 వేల వరకూ ఎఫ్ఐఆర్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. పోలీస్ శాఖలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ..ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. వాటిలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవే ఉంటున్నాయని డీజీపీ సవాంగ్ వివరించారు.
ప్రభుత్వం స్పందించిన తీరు ప్రశంసనీయం
గుంటూరు విద్యార్థిని హత్య ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ ప్రశంసించారు. ఈ కేసులో వేగంగా స్పందించిన అధికారులకు అవార్డులు ఇచ్చేందుకు సిఫార్సు చేస్తామన్నారు. నిందితుడిని వేగంగా అరెస్టు చేయటం, అత్యాచార నిరోధక చట్టాన్ని వేగంగా అమలు చేసిన అంశాలు ప్రశంసనీయమన్నారు. అయితే అన్ని కేసుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించిందని చెప్పలేమని వ్యాఖ్యనించారు. గతంలో జరిగిన ఘటనల వివరాలను తెప్పించుకుని అన్ని అంశాలనూ పరిశీలిస్తామని వెల్లడించారు. ఏపీలో నమోదైన ఇతర కేసుల్లోనూ వేగంగా స్పందించాలని కోరుతున్నామన్నారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో వాస్తవాల అన్వేషణలో భాగంగా గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం అంతకు ముందు పర్యటన చేపట్టింది. హత్య జరిగిన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. అలాగే రమ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం అతిథి గృహం వద్ద పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వినతులను స్వీకరించారు.
రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం. కుటుంబసభ్యులు, వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్నాము. రమ్య హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూసి.. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తాం. -ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దేర్
ఇదీ చదవండి
SC COMMISSION: రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్