HATS-OFF: కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి.. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ ఆమె వాహనాన్ని ఆపి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆమె అధైర్యపడకుండా ఎదురు తిరిగింది. అతడిని కర్రతో చితక్కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించారు. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అని కొనియాడారు.
అసలేం జరిగిందంటే...
చాలా రోజుల క్రితం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుట ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న యువతిని ఓ ఆటో డ్రైవర్ వేధించాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ సిబ్బంది దీనిని గమనించి, వేధింపులకు పాల్పడుతున్న యువకుడికి దేహశుద్ధి చేశారు. ఉద్వేగానికి గురైన సదరు యువతి వేధింపులకు కారణమైన ఆటో డ్రైవర్ని హైవే పైనే చితకబాదింది. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలే రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది.
ఇదీ చదవండి: CBN letter to CS: కుప్పం గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ