varla complaint: గుంటూరు జిల్లా అంగలూరు ఎస్సీ కాలనీకి.. వైకాపా ప్రభుత‌్వం మూడు రోజులుగా విద్యుత్ నిలిపివేయడంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. గుంటూరు జిల్లా ఏపూరు మండలం అంగలూరు గ్రామంలోని మొత్తం ఎస్సీ కాలనీలకి 72 గంటలకు పైగా కరెంటు కోత విధించారని లేఖలో పేర్కొన్నారు. పెండింగ్ విద్యుత్ బిల్లుల నెపంతో అంగలూరు ఎస్సీ కాలనీకి వైకాపా ప్రభుత్వం పూర్తిగా విద్యుత్‌ను నిలిపివేసిందని ఆరోపించారు.
కరెంటు కోతతో సరైన తాగునీరు అందక ఆ గ్రామంలోని దళితులు అంధకారంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల సాకుతో మొత్తం దళిత కాలనీకి మూడు రోజులకు పైగా విద్యుత్‌ను నిలిపివేయడం అమానుషమని మండిపడ్డారు.
ఎస్సీ కాలనీకి అత్యవసర ప్రాతిపదికన తక్షణమే విద్యుత్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: