Un prescribed medicine: వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యంతో యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా వచ్చే దుష్ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో.. 12 లక్షల చావులకు యాంటీబయాటిక్స్‌కు లొంగని సూక్ష్మక్రిములే కారణమని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్సెట్’లో ఇటీవల ప్రచురితమైంది. ఇది ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి ఏటా కోటికిపైగా మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.
ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషుల్లోనే కాకుండా పశువులు, జంతువులు, పక్షుల విషయంలోనూ నివారణ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశల వారీగా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ (నిరోధకత) ఎలా ఉందన్న దానిపై పరిశోధించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
ఇష్టారీతిగా వాడితే తీవ్ర నష్టం.. సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను పెంపొందించుకోవడం తరచూ జరిగేదే. వైద్య పరిభాషలో దీనిని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్)గా పేర్కొంటారు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడేకొద్దీ.. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వంటి వ్యాధికార సూక్ష్మక్రిముల్లో వాటికి స్పందించే గుణం తగ్గుతూ.. వ్యాధుల తీవ్రత పెరుగుతూ.. మరణాలు సంభవిస్తాయి. కలరా, టైఫాయిడ్, న్యుమోనియా, క్షయ వంటి బ్యాక్టీరియాకారక వ్యాధులు ఇలాగే విస్తరిస్తున్నాయి.
జంతువులు, కోళ్లు వంటి వాటిలో వ్యాధుల నివారణకు, ఇతర అవసరాల్లో సప్లిమెంట్లుగా యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. దీనివల్ల నిరోధకత పెంపొందించుకున్న సూక్ష్మక్రిములు ఆయా ఆహార పదార్థాల ద్వారా మనుషుల శరీరంలోకి చేరుతున్నాయి. వ్యవసాయంలో విరివిగా వాడుతున్న క్రిమిసంహారకాలు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయి.
ఈ తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (ఓఐఈ)లు సంయుక్తంగా ఎ.ఎం.ఆర్. ప్రణాళికను సిద్ధం చేయాలని అన్ని దేశాలను కోరాయి. ఈమేరకు భారత ప్రభుత్వం 2017లో ఎ.ఎం.ఆర్. జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, తదనుగుణ చర్యలకు రాష్ట్రాలను ఆదేశించింది.
ఇప్పటికే పూర్వ కృష్ణా జిల్లాలో పరిశోధన.. పూర్వ కృష్ణా జిల్లాలో గతంలో ప్రయోగాత్మకంగా దీనిపై పరిశోధనలు చేశారు. విజయవాడ ప్రభుత్వ సిద్దార్థ వైద్య కళాశాల, గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలల్లోని మైక్రోబయాలజీ విభాగాలు సంయుక్తంగా మనుషులు, పక్షుల మూత్ర నమూనాలను, ఆయా ప్రాంతాల్లోని తాగునీటి నమూనాలను సైతం పరీక్షించాయి.
ఈ-కోలీ అనే బ్యాక్టీరియాలో వివిధ రకాల యాంటీబయాటిక్స్‌కు ఎలాంటి మార్పులు వస్తాయన్న దానిపై పరిశోధనలు చేశాయి. ఈ నివేదిక కేంద్రానికి అందింది. వీటిపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశల వారీగా ఇలాంటి పరిశోధనలను చేయాలని సూచించింది. ఇందులో భాగంగా 20 మంది నెదర్లాండ్ (డచ్) శాస్త్రవేత్తల బృందం మనదేశంలో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పర్యటించబోతోంది. 16, 17 తేదీల్లో విజయవాడలో ఉంటుంది. వైద్యారోగ్య, పశుసంవర్థక శాఖల అధికారులు, వైద్య విద్యార్థులతో ఈ బృందం సమావేశం అవుతుంది. ఈనెల 15న తెలంగాణలోని వైద్యారోగ్య, పశుసంవర్థక శాఖ అధికారులతోనూ ఇదే విషయమై చర్చించబోతోంది.