ఈ చిన్నారి పేరు అక్షిత్. వయసు రెండేళ్లే... ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. తన జ్ఞాపకశక్తి మాత్రం అద్భుతం. ఒక్కసారి చెప్పడమే ఆలస్యం దేన్నైనా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు. వివిధ దేశాల జాతీయ పతాకాలను గుర్తు పడతాడు. దేశ రాజధానుల పేర్లను అనర్ఘళంగా చెప్పేస్తాడు. ఏదైనా ఒక్కసారి చూశాడా...? విన్నాడా... అంతే... ఎప్పుడైనా ఎక్కడైనా దాని గురించి చెప్పేస్తాడు. ప్రముఖుల చిత్రాలను చూసి వారి పేర్లూ చెప్పేస్తాడు. క్లిష్టమైన రసాయన సమీకరణాలు సైతం చెప్పి అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. ఇరవై నెలల వయస్సులోనే జనరల్ నాలెడ్జ్‌లో ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అక్షిత్ స్థానం సంపాదించి అరుదైన రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నాడు అక్షిత్.
విజయవాడ అయ్యప్పనగర్ లో నివాసముంటున్న మురళీకృష్ణ , శిరీష దంపతుల కుమారుడే ఈ అక్షిత్. తండ్రి బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. ఏడాదిన్నర వయస్సులోనే అక్షిత్ లోని ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని తల్లి శిరీష గుర్తించింది. తన ప్రతిభకు శిక్షణతో మరింత మెరుగు పెట్టిందామె. తన కుమారుడు శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని శిరీష ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే ఇంతటి అద్భుత ప్రతిభ కనపరుస్తున్న తమ కుమారుడ్ని చూసి ఎంతో గర్వంగా ఉందని తండ్రి మురళీకృష్ణ చెపుతున్నారు.
పుత్రుడు జన్మించినప్పుడు కాదు... ఆ కుమారుడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి సంతోషమని ఓ కవి చెప్పిన మాటలను.... అక్షిత్ రెండేళ్లకే సాకారం చేస్తున్నాడు.
ఇదీ చదవండి: