తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ, పీసీసీ రెండు కళ్లలాంటివని రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీగా ఎంపికైన నాటి నుంచి పార్టీ సీనియర్లను, కీలక నేతలను కలుసుకుంటున్న రేవంత్ రెడ్డి... ఈరోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని రోజులుగా కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా... భట్టి నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు ఉదయం పీసీసీ సీనియర్ ఉధ్యక్షుడు మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్ కలిసి.. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
జోడెద్దుల్లా పనిచేస్తాం...
"ఇద్దరం జోడెద్దుల్లా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కృషి చేస్తాం. రెండు తరాలుగా పార్టీకి సేవలందిస్తోన్న మల్లు కుటుంబం... కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారింది. పార్టీ పెద్దల అనుభవాలను స్వీకరిస్తూ.. ఇద్దరం సమన్వయంతో ముందుకెళ్తాం. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించే దిశగా పనిచేస్తాం. తెలంగాణ ప్రజలకు గౌరవం, స్వేచ్ఛ లేకుండా చేస్తోన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు అన్నివిధాల కృషి చేస్తాం. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతాం."
- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కలిసికట్టుగా కృషి చేయాలి...
"తెలంగాణ ఉద్యమ లక్ష్య సాధనకు అందరూ కలిసిగట్టుగా కృషిచేయాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను చేరుకునేందుకు... కిందిస్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నేతల వరకు అందరిని రేవంత్ రెడ్డి కలుపుకొని ముందుకు సాగాలి. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి విజయవంతం కావాలి. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చి రేవంత్‌కు మద్దతు తెలపాలి."
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
తమ్ముడిని బుజ్జగించిన అన్న...
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ను నియమించటంపై పార్టీలోని పలు సీనియర్లు వ్యతిరేకంగా ఉండగా... వారందరిని బుజ్జగించే పనిలో మల్లు రవి తలమునకలయ్యారు. పలువురు సీనియర్లను కలిసి.. రేవంత్‌కు మద్దతివ్వాలని స్వయంగా కోరుతున్నారు. రేవంత్‌ను వ్యతిరేకించిన వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒకరు. టీపీసీసీగా శ్రీధర్ బాబుకి అవకాశం ఇవ్వాలని భట్టి కోరగా.. మల్లురవి రేవంత్‌కు మద్దతిచ్చారు. చివరికి అధిష్ఠానం కూడా రేవంత్‌కే మొగ్గుచూపటం వల్ల భట్టి కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఆ విషయంపైనే రేవంత్‌ను కలిసేందుకు ఇన్ని రోజులు విముఖత చూపించారు.
నన్ను గెలిపించినందుకే మద్దతు...
భట్టితో మల్లు రవి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పీసీసీ ఎంత ముఖ్యమో.. సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యమని, పీసీసీ, సీఎల్పీ రెండు కళ్లలాంటి వారని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ నిర్ణయం మేరకు పనిచేయాలని భట్టికి సూచించినట్టు తెలిపారు. గతంలో తాను ఎంపీగా గెలవడానికి రేవంత్ కుటుంబం పని చేసిందని.. అందుకే తాను రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచానన్నారు. తన అనుచరులతో మాట్లాడతానని భట్టి చెప్పారని రవి తెలిపారు.
మర్రికి, శ్రీధర్‌బాబుకు ఆహ్వానాలు...
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని రేవంత్ కలిశారు. అపారమైన అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి సలహాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్ తెలిపారు. సమష్టి నిర్ణయంతో ముందుకు వెళతామని పేర్కొన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును రేవంత్ కలుసుకున్నారు. రేపటి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.