Tiger roaming in bhupalpally forest: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. కొన్ని రోజులుగా మహదేవపూర్, కాటారం, పలిమెల, మల్దార్, మహాముత్తారం మండలాల పరిధిలోని అడవుల్లో సంచరిస్తోంది. కాటారం మండలం ఒడిపిల వంచ సమీప అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులి... అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కింది. మూడు రోజుల క్రితం ఆ ప్రాంత సమీపంలో పులి.. ఆవుపై దాడిచేసి చంపింది. స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పులిపాద ముద్రలు, ఆనవాళ్లు గుర్తించారు.
అధికారులు అప్రమత్తం
పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల మహాముత్తారం మండలం యామనపల్లి- ఆజంనగర్ అటవీ ప్రాంతాల మధ్య పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. నిమ్మగూడెం అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసింది. మలహర్ మండలం కిషన్‌రావుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు కనిపించడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి గోదావరి దాటి తెలంగాణలోకి పులి ప్రవేశించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. పశువుల కాపరులు, ఇతరులు అడవి వైపు వెళ్లకూడదని హెచ్చరించారు. పులికి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే .. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.