ఏపీలో వ్యవసాయ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఏపీలో రైతుల సగటు ఆదాయం గురించి పార్లమెంటులో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో కొన్ని పంటల ఉత్పాదకత జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. పంటలపై ప్రకృతి వైఫరీత్యాల ప్రభావం పడుతోందన్నారు. 15.16 లక్షల హెక్టార్ల పంట పొలాలపై విపత్తుల ప్రభావం ఉందన్నారు. ఏపీలో వ్యవసాయంపై నికర ఆదాయం 33.8 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో వేతనాల ద్వారా వచ్చే ఆదాయం 41.5 శాతంగా ఉందన్నారు. జాతీయస్థాయికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఏపీలో ఉందన్నారు.
ఏపీలో భూకమతాల పరిమాణం తగ్గుతోంది..
ఏపీలో భూకమతాల పరిమాణం, నికర ఆదాయం తగ్గుతోందని మంత్రి తోమర్ వెల్లడించారు. సగటు ఆదాయ తగ్గుదలకు చిన్న కమతాలే కారణమన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉందన్నారు. భూకమతాల విస్తీర్ణం తగ్గి, కమతాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం ఏపీలో రైతుల నెలవారీ సగటు ఆదాయం రూ.5,979 గా ఉందని ఆయన వెల్లడించారు.
ఇదీచదవండి
'ఏపీ ప్రభుత్వం నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం'