హైదరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్ భూముల వేలం(kokapet lands auction) ప్రక్రియను ఆపేందుకు హైకోర్టు(telangana high court) నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూమిని గురువారం వేలం వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేలం ప్రక్రియ ఆపాలని కోరుతూ భాజపా నేత విజయశాంతి(bjp leader Vijaya shanthi) తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(pill) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రజా ప్రయోజనాల కోసం ఒక్కో జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాల భూబ్యాంకు ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. దానికి విరుద్ధంగా భూములను వేలం ద్వారా అమ్మేందుకు ఆదేశాలిచ్చిందని విజయశాంతి తరఫున న్యాయవాది వాదించారు. భూముల విక్రయానికి సబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఎలా ఉంటాయని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కోకాపేటలో గతంలోనూ ప్రభుత్వం భూములు వేలం వేసిందని.. ఆ జీవోను హైకోర్టు సమర్థించిందని ఏజీ వివరించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ(AG) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఈ సందర్భంగా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రేపటి వేలాన్ని నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
కోకాపేట.. కాసుల పంట
కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. 49.92 ఎకరాలను ఈనెల 15వ తేదీన ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) వేలం వేయబోతోంది. ఇప్పటికే వేలం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ భూములను కొనుగోలు చేయడానికి భారీ డిమాండ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఎకరా రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా సర్కారుకు రూ.2500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బాహ్యవలయ రహదారి నుంచి ఈ వెంచర్‌లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ట్రంపెట్ నిర్మాణాన్ని కూడా అధికారులు మొదలుపెట్టారు.
గోల్డెన్ మైల్
గతంలో కోకాపేట చుట్టుపక్కల వేలం వేసినపుడు ఎకరా రూ.40 కోట్ల ధర పలికింది. ఈసారి దీనికి మించి రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య ధరపలికే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు వేలంలో పాల్గొంటున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలం ప్రక్రియను పూర్తి చేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు (HMDA officials) ఏర్పాట్లు చేశారు. ఈ నియోపోలిస్ వెంచర్ (Neopolis Kokapet Vencher) ఏర్పాట్లన్నింటిని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ (Chief Secretary of the Municipal Department Arvind Kumar) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెంచర్ లోపల వంద అడుగుల రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఖానామెట్‌లోని 15.01 ఎకరాలను ఈనెల 16వ తేదీన వేలం వేయడానికి టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేసింది. ఈ వెంచర్‌కు గోల్డెన్ మైల్ (Golden Mile)అని పేరు పెట్టారు. ఈ భూములకు కూడా భారీ ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి:SOMU VEERRAJU: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయం జరగనివ్వం'