KC Canal: కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-1కు (కేడబ్ల్యూడీటీ) విరుద్ధంగా కర్నూలు-కడప కాల్వకు (కేసీ కెనాల్) ఏపీ ప్రభుత్వం నీటి మళ్లింపులు చేపడుతోందని.. దీన్ని కట్టడి చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్.. బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు.
‘‘అంతర్రాష్ట్ర ఒప్పందాలను తోసిపుచ్చి కేసీ కాల్వకు 10 టీఎంసీల కేటాయింపును 39.9 టీఎంసీలకు ఏపీ పెంచుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 885 అడుగుల స్థాయి, మల్యాల పంప్ హౌస్ ద్వారా 833 అడుగులు, ముచ్చుమర్రి పంప్‌హౌస్ ద్వారా 798 అడుగుల స్థాయి నుంచి నీటిని తోడుకుంటోంది. కేసీ కాల్వ ఆధునికీకరణ సమయంలో ఏపీ 39.9 టీఎంసీలలో 8 టీఎంసీలు ఇతర ప్రాజెక్టులకు కేటాయింపు చేపట్టి కాల్వకు 31.9 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా నదికి తుంగభద్ర నుంచి 2 టీఎంసీల నీటిని ప్రవాహ నిమిత్తం విడుదల చేయాలి. ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల వద్ద హంద్రీనీవా లిఫ్టు, ముచ్చుమర్రి వద్ద హంద్రీనీవా-కేసీ కాల్వ లిఫ్టులను ఏర్పాటుచేసి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా నీటిని కేసీ కాల్వకు తరలిస్తోంది. ఇవన్నీ అనధికారిక మళ్లింపులే. గురు రాఘవేంద్ర ఎత్తిపోతలతో పాటు తుంగభద్ర కుడి కాల్వపై 12 పంప్‌హౌస్‌లను నిర్మించి మరో 5.37 టీఎంసీల నీటిని అనధికారికంగా ఏపీ మళ్లిస్తోంది. కేసీకాల్వ, తుంగభద్ర కుడి లోలెవల్ కాల్వ కింద నీటి వినియోగాన్ని లెక్కించాలి. దీంతోపాటు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని మళ్లించే కేంద్రాల వద్ద సెన్సార్లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటి తోడకాన్ని నమోదు చేయాలి. కేసీకాల్వకు 31.9 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు మళ్లించకుండా చూసేలా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టాలి. తుంగభద్ర, కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న న్యాయమైన వాటాలను వినియోగించుకునేలా తక్షణమే బోర్డు చర్యలు చేపట్టాలి’’ అని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మరో మెలిక