తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే..? దేశద్రోహులా..? అని నిలదీశారు. కేంద్రం ధాన్యం సేకరిస్తుందో లేదో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు.
'నా ప్రశ్నకు బండి సంజయ్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. బండి సంజయ్‌కు మెడ మీద తలకాయ లేదని తేలిపోయింది. మేం పిలుపు ఇచ్చిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొంటారా? నేను రైతులకు మళ్లీ చెబుతున్నా.. యాసంగిలో వరి వేయొద్దు. నేను తిట్టాకైనా.. బండి సంజయ్ కేంద్రమంత్రిని అడగొచ్చు కదా.. అడిగారా..? డీజిల్, పెట్రోల్‌పై సెస్ ఉపసంహరించుకుంటారా?.. చస్తారా..? కేంద్రం హైవేలు కట్టకుండా.. గడ్డి పీకుతుందా.. కేంద్రంలో ఎందుకు ఉన్నారు? ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే కట్టారా?.. సాగర్ కమీషన్ల కోసం కట్టారా? మా పార్టీకి వచ్చే డబ్బు గురించి పార్టీ ప్లీనరీలోనే చెప్పా. ప్రస్తుతం పార్టీలో రూ.450 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మరో రూ.450 కోట్లు వస్తాయి. మా హద్దులు మాకు తెలుసు.. మా క్రమశిక్షణ మాకు తెలుసు.. మమ్మల్నేం చేయలేరు. కాళేశ్వరం ప్రాజెక్టును న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. కాళేశ్వరంపై డిస్కవరీ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది.
- కేసీఆర్, తెలంగాణ సీఎం
అప్పుడేం చేశారు ? పడుకున్నారా ?
ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారంటూ తెలంగాణ భాజపా నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు శాశ్వత ద్రోహం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారంటూ నిలదీశారు. విభజనలో భాగంగా ఏపీలో ఏడు మండలాలను కలిపినప్పుడు నిద్రపోయారా ? అని ప్రశ్నించారు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నప్పుడు ప్రధానిని ఫాసిస్టు అని విమర్శించినట్లు చెప్పారు. ఫాసిస్టు ఎందుకన్నావని మోదీ తనను అడిగారని చెప్పారు. రాష్ట్రానికి ద్రోహం చేసినందుకే ఫాసిస్టు అన్నానని మోదీతోనే చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు
దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తాం. దళితబంధు మా ఎజెండా. హుజూరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేసి తీరుతాం. ఈ ఏడాది హుజూరాబాద్‌లో ప్రతి కుటుంబానికి దళితబంధు ఇస్తాం. నాలుగు మండలాల్లోనూ సంపూర్ణంగా దళితబంధు అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్‌లో 2 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు 4, 5 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తాం. దళిత బంధు ఫలాలు రెండేళ్లలోనే రాష్ట్రానికి చూపిస్తాం. దేశ చరిత్రలో అన్ని లైసెన్స్‌డ్ దుకాణాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం మనదే.
- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉంది..
పత్తికి ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉందని కేసీఆర్ తెలిపారు. అతి త్వరలో ఒకేసారి తీసే పత్తి పంట రాబోతోందన్నారు. ఒకేసారి తీసే పత్తి వంగడం విదేశాల నుంచి తెప్పించామని చెప్పారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో సాగవుతోందని పేర్కొన్నారు. మినుములకు కూడా మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి పండించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇకపై ఏటా ఉద్యోగ క్యాలెండర్..
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. 2, 3 రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు. నవంబర్‌లోనే ఉద్యోగుల సర్దుబాటు పూర్తవుతుందన్నారు. ఉద్యోగుల సర్దుబాటు తర్వాత 70 వేల వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇకపై ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: CM KCR: నాకు సమాధానం కావాలి... అప్పటివరకు భాజపాను వదిలిపెట్టను: కేసీఆర్