Teachers unions and pensioners protest: ఉపాధ్యాయుల ఉద్యమంపై ప్రభుత్వం దాడి చేస్తోందని, సమస్యలను విన్నవించేందుకు సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదని పీడీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల వేదిక ఆధ్వర్యంలో.. విజయవాడలో శుక్రవారం రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఉద్యోగుల జీతాలు తగ్గించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. అశుతోష్ మిశ్ర నివేదిక ఇవ్వకుండానే పీఆర్సీ అమలు చేశారని, రికవరీల నిలిపివేత ఉత్తర్వులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు.
‘‘ఉపాధ్యాయ ఉద్యమంపై ప్రభుత్వం దాడి చేస్తోంది. అన్నింటిపైనా ఆంక్షలు విధిస్తోంది. ఉపాధ్యాయ ఉద్యమాల శకం ముగిసిందని అధికారులు వైకాపా కార్యకర్తల్లా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు.
సీఎం సమయం ఇవ్వడం లేదు
సీఎం జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. ‘‘మొదట శాసనమండలి రద్దు చేస్తున్నట్లు ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత ఉంచాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల ఉద్యమాన్ని ఎర్ర జెండాలు, పచ్చ జెండాలని అంటున్నారు. సమస్యలపై మాట్లాడేందుకే సీఎం సమయం ఇవ్వడంలేదు’’ అని తెలిపారు. అశుతోష్ మిశ్ర నివేదిక బయటకు రాకుండానే పీఆర్సీ అమలు చేశారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ.. ఫ్యాప్టో కలెక్టరేట్ల ముట్టడి తర్వాతే ఉద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని, గ్రాట్యుటీ అమలు తేదీని మార్పు చేయాలని కోరారు. పీఆర్సీ ఉత్తర్వులతోపాటు ఇస్తామన్న మిశ్ర నివేదిక, రికవరీ నిలుపుదల ఆదేశాలు ఇంత వరకు ఇవ్వలేదని ఫ్యాప్టో ఛైర్మన్ సుధీర్‌బాబు వెల్లడించారు.
‘‘సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ హామీకి ఎన్ని వారాలు గడవాలి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు పెంచాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉద్యోగుల వేతనాలు తగ్గించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. పీఆర్సీపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో 99.6శాతం అసంతృప్తి ఉంది’’ అని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఏపీటీఎఫ్ అధ్యక్షులు భానుమూర్తి, హృదయరాజు, ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ, శ్రీనివాసులరెడ్డి, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Tidco Houses : పేదల మేడ.. గేదెలకు నీడ!