నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదినాన.. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ రెండో రోజు మహానాడు కార్యక్రమాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు కార్యకర్తలు భౌతిక దూరం పాటిస్తూ సాదర స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నేతలు నివాళులు అర్పించారు. రామారావు విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు రెండో రోజు వేడుకను లాంఛనంగా ప్రారంభించారు.
కార్యకర్తలే పార్టీ శక్తి
ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ అని కొనియాడిన చంద్రబాబు... ఆయన జీవితం ఆదర్శనీయమని కీర్తించారు. సేవకు నిలువెత్తు రూపంగా నిలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు... సవాళ్లు పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు. తెలుగుదేశాన్ని ఎవరూ కదిలించలేరన్న ఆయన... ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారంటూ ప్రశంసించారు. హత్యా రాజకీయాలు తమకు అలవాటు లేవని.. కార్యకర్తలే పార్టీ శక్తి అని పునరుద్ఘాటించారు.
మేమే కాదు కార్యకర్తలందరూ వారసులే
తన అవసరం ఎప్పుడు, ఎక్కడ ఉంటే అక్కడకు వస్తానని తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని... ఇప్పుడే కాదు గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుచేశారు. ప్రస్తుత అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎప్పుడూ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్న బాలకృష్ణ... ఐదేళ్ల తర్వాత చంద్రబాబు సారథ్యంలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
తమ కుటుంబసభ్యులు మాత్రమే ఎన్టీఆర్ వారసులు కాదని.. కార్యకర్తలంతా ఆయనకు వారసులేనని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ను అనుకరించేవారు కాకుండా అనుసరించేవారు కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులు తన తండ్రి మానస పుత్రికలని.. ఆయన కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు పెరిగాయని.. తండ్రి, గురువు, దైవం తనకన్నీ ఎన్టీఆరే అని ఉద్ఘాటించారు.
రాజకీయాలకు సరికొత్త నిర్వచనం
మహానేత ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం తమకు దక్కిన అదృష్టమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయనతో కలిసి ప్రారంభించిన ప్రజాసేవ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. తెలుగుభాష, సంస్కృతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుందని చెప్పారు.
ఆయన సేవలు చిరస్మరణీయం
ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలు, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను తెలుగుదేశం సీనియర్ నేతలు మహానాడు వేదికగా పంచుకున్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని గుర్తుచేశారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంతోపాటు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఆయనని కొనియాడారు.
తెదేపా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చినరాజప్ప, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య తదితరులు రెండోరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: