TDP President Chandrababu : వైకాపా పాలనలో పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికే పరిమితమయ్యాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించిన వ్యవస్థల్ని జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలన అంతా అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులని విమర్శించారు. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైకాపా ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కక్ష సాధిస్తున్నారు...
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను, ఆ పార్టీ నేతల అవినీతిని ఎప్పటికప్పుడు వెలికితీసి, ప్రజలకు తెలియజేస్తున్నారన్న కారణంతో జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు ఇంకెన్నాళ్లు సంకెళ్లు వేస్తారని ప్రశ్నించారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా అని ప్రశ్నించారు. లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా గొంతు నొక్కుతున్నారు...
TDP President Chandrababu : వైకాపా నేతలు చెప్పినట్టు చేస్తూ... సీఐడీ అధికారులు, సంస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లుగా మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగినా ఈ ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరన్న చంద్రబాబు... ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.