కాపు కార్పొరేషన్‌ను చంపేసిన వారే కాపుల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏడాది గడిచినా జగన్ ప్రభుత్వం కాపులకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలందరికీ అమలుచేసే సంక్షేమ పథకాల వ్యయాన్ని కాపు కార్పొరేషన్లో చూపడం దారుణమన్నారు.
పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగభాగం, ఉభయగోదావరి జిల్లాల్లోని కాపులకు కేటాయించినట్లు చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాపు యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగాలకు దూరమయ్యేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలం నుంచి కాపులకు ఉన్న రిజర్వేషన్లను మధ్యలో కొందరు తొలగించినా చంద్రబాబు తిరిగి ప్రవేశపెట్టారని రామానాయుడు గుర్తుచేశారు. చంద్రబాబు అమలు చేసిన రిజర్వేషన్లు తొలగించే హక్కు జగన్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. వై.ఎస్. కొడుకుగా జగన్ కూడా కాపులను మోసగించి, వారిని ఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వై.ఎస్. వారసుడైన జగన్ ఏ ముఖం పెట్టుకొని కాపుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: 'అన్నీ ప్రభుత్వమే కొంటుంటే ఇక అరబిందో ఎందుకు?'