ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంతో.. ముఖ్యమంత్రి జగన్‌లో కేసుల భయం మరింత పెరిగి, రాష్ట్ర ప్రయోజనాల్ని ఇంకా నీరుగార్చే అవకాశముందని తెదేపా పార్లమెంటరీ పార్టీ అభిప్రాయపడింది. త్వరలో మళ్లీ ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రాన్ని డిమాండు చేయడంతోపాటు, వాటిని సాధించేలా వైకాపాపైనా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. జగన్ తనపై ఉన్న కేసుల భయంతో రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టకుండా, కేంద్రంతో పోరాడాలని సమావేశం డిమాండు చేసింది.
‘భాజపా బలపడేకొద్దీ రాష్ట్ర హక్కులపై కేంద్రాన్ని నిలదీయలేని స్థితిలోకి జగన్ వెళతారు. వైకాపా ఎంపీలూ పార్లమెంటులో ఏమీ మాట్లాడలేరు. 28 మంది ఎంపీలున్నా.. విభజన హామీలు, కేంద్రం నుంచి రావలసిన నిధులు సాధించుకోవడంపై జగన్ ఇప్పటి వరకు ఒక్క సమావేశమూ నిర్వహించలేదు’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రజలకు భాజపా చేయాల్సిన న్యాయం చేయలేదు కాబట్టే ఇక్కడ ఒక శాతం ఓట్లూ రావడం లేదు. మాకు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కుల కోసం దిల్లీలో పోరాడతాం. కేంద్ర నిధుల దారి మళ్లింపు, జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడం, శాంతిభద్రతల వైఫల్యం, పోలీసులు అరాచకాలు వంటి అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తాం. రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని నొక్కి చెబుతాం’ అని రామ్మెహన్ నాయుడు తెలిపారు. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు.
'ఈటీవీ భారత్' కథనానికి స్పందన.. విధివంచిత కుటుంబానికి ఉపరాష్ట్రపతి ఆర్థిక సాయం