డేటా సేకరణ పేరుతో ఉపాధ్యాయులను పాఠశాలలకు రమ్మనటం దుర్మార్గమని తెదేపా ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ మండిపడ్డారు. బయోమెట్రిక్‌పై సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్‌లోని ఉపాధ్యాయులను తమ తమ పాఠశాలకు వెళ్లి యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ డేటా సేకరించమని సూచించటం సరికాదన్నారు. వారు తప్పకుండ పాఠశాలలకు హాజరుకావాలని ఈ నెల 22న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ 145/ఎ/1-2020 పేరుతో సర్కూలర్ జారీ చేశారని గుర్తుచేశారు.
కరోనా సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లటం ప్రమాదకరమనే విషయాన్ని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గుర్తించాలన్నారు. ఇప్పటికే నాడు-నేడు పేరుతో ఉపాధ్యాయులను, షూ కొలతల కోసం విద్యార్థుల్ని పాఠశాలలకు రప్పించారన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అనాలోచిత చర్య అని రామకృష్ణ విమర్శించారు.