తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్నే రాష్ట్రమంతా కోరుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ఇసుకపై ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం 750 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడం కోసం పాలకులు ఆ మొత్తం వదులుకోలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, వివిధరకాల పన్నులతో ప్రజలపై భారం మోపిన ప్రభుత్వానికి 750కోట్లు వదులుకోవడం పెద్దకష్టం కాదని పేర్కొన్నారు. ఇసుకను జగన్ ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుందని ఆరోపించారు.
కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు పెరిగేలా చేసిందని మండిపడ్డారు. జగన్ తన జేట్యాక్స్ కోసం సిమెంట్ కంపెనీలను బెదిరించి ధరలు పెరిగేలా చేశారని ధ్వజమెత్తారు. ఇసుక అందుబాటులో లేక పల్లెల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయని ప్రజలు గగ్గోలుపెడుతున్నారన్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకముందే, ఉచిత ఇసుకవిధానాన్ని అందుబాబులోకి తెస్తే మంచిదని హితవు పలికారు.
ఇదీ చదవండి: 'ఉమా అరెస్టును అడ్డుకున్న మహిళలపై లాఠీఛార్జీ చేయడం దారుణం'