రాష్ట్ర అసెంబ్లీలో నియంత పరిపాలన సాగుతోందని తెదేపా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా మరణాలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల బాధల్ని వివరించి న్యాయ విచారణకు డిమాండ్ చేస్తుంటే తమ గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుబడితే.. సోమవారం ఐదుగురు, ఇవాళ 11మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.
మూడేళ్ల క్రితం వివేకా హత్యను సహజ మరణంగా చిత్రీకరించిన వైకాపా నేతలు.. ఇప్పుడు కల్తీసారా చావుల్నీ అలానే చిత్రీకరిస్తున్నారని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కల్తీసారా మరణాలకంటే ప్రాధాన్యమైన అంశం ఏముందని ప్రశ్నించారు. తమ అవినీతి బయటపడుతుందనే సభలో కాల్తీ సారా అంశం చర్చకు రాకుండా అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఆక్షేపించారు. మార్షల్స్ సాయంతో సభను ఎన్నిరోజులు నడుపుకుంటారని నిలదీశారు.
మండలిలో చర్చకు ధైర్యం లేకే ప్రభుత్వం పారిపోయింది: ఎమ్మెల్సీలు
కల్తీసారా మరణాలపై ముఖ్యమంత్రి తెప్పించిన నివేదికను సభకు ఎందుకు సమర్పించలేదని తెలుగుదేశం ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో కల్తీ సారా కేసులు నమోదైతే అక్కడ సారా అమ్మకాలు లేవని ప్రభుత్వం ఎలా చెప్తుందని నిలదీశారు. మండలిలో చర్చకు ధైర్యం లేకనే ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: పవన్‌కల్యాణ్ మాటలతో ఏకీభవిస్తున్నాం.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయమన్న తెదేపా నేతలు