జగనన్న విద్యా కానుక పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. పాఠ్య పుస్తకాలు, విద్యాకానుక వంటి వాటిని నేరుగా విద్యార్థుల ఇళ్లకెళ్లి అందజేసేలా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. వైకాపా మంత్రులే కరోనాకి భయపడి ఇళ్ళలో ఉంటే విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని.. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులే కరోనా బారినపడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే నవంబర్ 5 నుంచి పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు. రాష్ట్రంలో సుమారు 200 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి: పట్టాభికి చంద్రబాబు ఫోన్