TDP LEADERS MEETING: పేదలెవరూ ప్రభుత్వానికి డబ్బు కట్టాల్సిన పనిలేదని... తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లు రిజిస్టర్ చేసిఇస్తామని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వ్యూహకమిటీ భేటీలో నేతలు పునరుద్ఘాటించారు. బీసీ జనగణన జరపాలని, ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానించి బోగస్ ఓట్లను ఏరివేయాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండాలని, మద్యపానాన్ని తగ్గించేందుకే 75 శాతం మేర ధరలు పెంచామని గతంలో చెప్పిన జగన్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారని.. మద్యనిషేధం హామీకి తూట్లు పొడిచారని అన్నారు.
సంక్షేమం పేరుతో ఇచ్చేది గోరంత, దోచుకునేది కొండంతని.... తెదేపా నేతలు ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకి 13వేల 500 ఇస్తామని చెప్పి, కేవలం 7వేల500 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో... ఐదేళ్లలో ప్రతి రైతుకి లక్ష వరకు లబ్ధి చేకూరిందని.. ఇప్పుడు 20వేల రూపాయలు మాత్రమే దక్కుతోందన్నారు. జగన్ పాలనలో రాయలసీమ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని.... నేతలు చెప్పారు. తెదేపా హయాంలో రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి జరిగిందన్నారు. కియా కార్ల కంపెనీ, సిమెంట్, సెల్‌ఫోన్ పరిశ్రమలు, సౌరవిద్యుత్ యూనిట్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు, సాగునీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రాయలసీమకు జగన్ చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని నేతలు తీర్మానించారు.
రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్నీ తరిమేస్తున్నారని సమావేశంలో తెదేపా నేతలు ఆరోపించారు. ఇవన్నీ మేధావులకు, పేటీఎం బ్యాచ్‌లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం, రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విభజన హామీల అమలులో జగన్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి..... నిధులు సాధించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి డబ్బులు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి, రెండున్నరేళ్లు గడిచినా అతీగతీలేదని విమర్శించారు. ఉద్యోగుల డిమాండ్‌లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: