TDP Protest in ap : వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా.. కృష్ణా జిల్లా గన్నవరంలో బచ్చుల అర్జునుడు, తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఓటీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళనలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటీఎస్ కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటీఎస్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డిమాండ్ చేశారు. పేదలు తీవ్ర ఆర్థిక భారంతో ఉన్నారని, మళ్లీ ఇప్పుడు వన్ టైం సెటిల్‌మెంట్ పేరిట డబ్బులు వసూలు చేయడం సరికాదని పాలకొండ నేతలు అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజ్యాంగం పట్ల గౌరవం కలిగేలా బుద్ధి మారాలని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తెదేపా నేతలు కోరారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో తెలుగుదేశం నాయకులు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
ఇవీచదవండి.