ఉపాధి హామీ బకాయిలు విడుదలపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. కోర్టు వేసిన మొట్టికాయలకు జగన్ ప్రభుత్వం సిగ్గు పడి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం చేస్తున్న న్యాయ పోరాటానికి ధర్మాసనం తీర్పుతో న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. కుంటి సాకులు చెబుతూ, కోర్టును పక్కదోవ పట్టిస్తూ రెండున్నర ఏళ్లుగా సమస్యను కావాలనే ప్రభుత్వం సాగతీసిందని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.
వైకాపా నేతల పెత్తనం ఎక్కువైంది: ఎమ్మెల్సీ అశోక్ బాబు
వైకాపా ప్రభుత్వంలా.. దేశంలో మరే ప్రభుత్వమూ దిగజారట్లేదన్నది నరేగా పెండింగ్ బిల్లులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు మొత్తం 6 డీఏలను.. వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టడాన్ని విమర్శించారు. డీఏతో పాటు పీఆర్సీ అనేది ఉద్యోగుల హక్కని పేర్కొన్నారు. వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులపై ప్రదర్శిస్తున్నంత జులుం, పెత్తనం కూడా మరే రాష్ట్రంలోనూ లేదని ధ్వజమెత్తారు.
27 శాతం ఐఆర్ ఇచ్చామనే సాకుతో పీఆర్సీ ఇవ్వకపోవటం ప్రభుత్వానికి సరికాదని హితవు పలికారు. సీపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నందుకు ముఖ్యమంత్రి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఒకరిరద్దరు ఉద్యోగ సంఘాలనేతలను పక్కనపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులంతా తనపక్షానే ఉన్నారనే మూర్ఖత్వంలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. హక్కుల కోసం ఉద్యోగులు చేసే ఎలాంటి పోరాటానికైనా తెదేపా మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఇవీ చదవండి: