ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ వ్యక్తిగత అభిమతాన్ని గౌరవిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరిస్తున్నారని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మెన్ వెంకట్రామిరెడ్డికి అంతటి ఆపుకోలేని అభిమానముంటే.. వైకాపా కండువా కప్పుకొని జగన్ పంచన చేరాలని హితవు పలికారు. వైకాపా 20 నెలల పాలనలో సాగించిన అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలను భరించిన ప్రజలు.. సరైన విధంగా సమాధానం చెబుతారన్న భయంతో సీఎం జగన్ ఎన్నికలు వద్దంటున్నారా అని రాజు నిలదీశారు. ఉపాధ్యాయులు, పోలీసులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టినప్పుడు.. విద్యార్థుల జీవితాలను పట్టించుకోకుండా ప్రభుత్వం పాఠశాలలు తెరిచినప్పుడు ఉద్యోగ సంఘాలకు కరోనా గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈవీఎంలతో గెలిచిన వ్యక్తి కాబట్టే.. సీఎం జగన్ స్థానిక ఎన్నికలంటే భయపడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ స్థానిక ఎన్నికలకు స్వాగతిస్తున్నారని.. ఆయా సంఘాల అధ్యక్షులే సిబ్బంది సిద్ధంగా లేనట్లు చెప్పుకొస్తున్నారని తెదేపా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందడానికే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు.. ఎన్నికల విధులు నిర్వహించలేమని చెబుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎస్ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులోనూ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. గతంలో తాను ప్రభుత్వ అధికారిగా పని చేసిన సమయంలో.. అనేక విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు సమర్థంగా పని చేసినట్లు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కొవిడ్‌ను సాకుగా చూపించి.. ఎన్నికల విధులు నిర్వహించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: