స్థానిక సంస్ధల ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయంలో వైకాపా దౌర్జన్యాలు నిలువరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగు దేశం పార్టీ కోరింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబును తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, అశోక్ బాబు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ల దాఖలు సందర్భంగా గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరంలో వైకాపా నేతలు భయోత్పాతం సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. కొందరు అధికారులు వైకాపా తరపున పనిచేస్తున్నారని మండిపడ్డారు.
వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే అధికారిని కుప్పం మున్సిపాలిటీలో నియమించారని.. ఆయన్ను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు నేతలు తెలిపారు. స్థానిక సంస్థల్లో స్వేచ్చాయుత వాతావరణంలో విపక్ష పార్టీలు నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైకాపా ప్రభుత్వం చేస్తోన్న దౌర్జన్యాలపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: CHANDRABABU: ప్రజలు తిరగబడితే పారిపోతారు.. ఖబడ్దార్: చంద్రబాబు