గుంటూరు జిల్లా పల్నాాడులో అధికార పార్టీ ఆగడాలు, అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి ప్రోద్భలంతో అక్రమ మైనింగ్, మద్యం, నాటు సారా, గుట్కా వంటి అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. దాచేపల్లిలో వడ్డెర కార్మికులు క్వారీలో జీవనం సాగిస్తుంటే...వారి కష్టాన్ని రౌడీషీటర్ ద్వారా దోచుకుంటూ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దాడుల కారణంగానే గుంటూరు జీజీహెచ్‌లో నీలకంఠం అనే యువకుడు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలకంఠం కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వటంతో పాటు గాయపడిన మరో ముగ్గురు యువకులకూ పరిహారం చెల్లించాలని యరపతినేని డిమాండ్ చేశారు.
వివిధ గ్రామాల్లో దాదాపు 80మంది తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులకు పాల్పడితే పోలీసులు ఇంతవరకు కేసులు నమోదు చేయలేదని ఆక్షేపించారు. ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచుతూ అక్రమార్జనే లక్ష్యంగా కాసు మహేశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. దోచుకోవటానికి పల్నాడు, దాచుకోవటానికి నర్సరావుపేట అన్నట్లుగా మహేశ్ రెడ్డి తీరు ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు.
ఇదీచదవండి
'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్‌ను కస్టడీలోకి తీసుకోవద్దు'