సోలార్ టెండర్లు రద్దుపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని కళా వెంకట్రావు నిలదీశారు. టెండర్ల రద్దుతో ప్రపంచ స్థాయిలో రాష్ట్రం, దేశ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లలో అవకతవకలు వల్లే హైకోర్టు రద్దు చేసిందన్నారు. టెండర్లను అధిక భాగం అదానీ, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బినామీ నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలకు కట్టబెట్టాలని చూశారని ఆరోపించారు. గత తెదేపా హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కాలపరిమితి 25 ఏళ్లు ఉంటే వైకాపా నేతలు గగ్గోలు పెట్టారని., మరి ఇప్పుడు కాలపరిమితిని 30 ఏళ్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. దేశమంతా కనిష్టంగా రూపాయి 90 పైసలకే యూనిట్ సోలార్ విద్యుత్ లభిస్తుంటే, 60 పైసలు అదనంగా పెంచి కట్టబెట్టి కమీషన్లకు కక్కుర్తిపడాలని చూశారని మండిపడ్డారు.
ఒప్పందం చేసుకున్నన్ని రోజులు ఒకటే టారిఫ్ ను ఎందుకు అమలు చేయాలనుకోలేదని కళా వెంకట్రావు నిలదీశారు. నీటి లభ్యత సరిగాలేని సమయంలోనూ తెదేపా 24 గంటల విద్యుత్ అందించిందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పుష్కలంగా నీటి లభ్యత వున్నా ప్రభుత్వం వద్ద ప్రణాలిక లేక విద్యుత్ కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్ర నష్టాలతో రైతులు అతలాకుతలమవుతుంటే బోర్లకు మీటర్లు బిగించి అప్పుల కోసం రైతుల ఉసురుతీసుకునేందుకు సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లు, రోడ్డు కాంట్రాక్టులకు, చిన్నచిన్న కాంట్రాక్టు పనులకు కూడా స్పందన రావడం లేదంటే కమీషన్లు ఏ స్థాయిలో అడుగుతున్నారో అర్థమవుతోందని కళా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరు అడుగుపెట్టాలన్నా వైకాపా వాళ్లు అడిగే వాటాలతో హడలెత్తిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కృష్ణా నది తీరంలో ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం!