విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు(tdp leader kala venkat rao serious over power cuts and power shortage) ధ్వజమెత్తారు. అసమర్థత, అవినీతితో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు యూనిట్ కరెంటును రూ. 20 కి కొనుగోలు చేసే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. రైతు రాజ్యం పేరిట.. కరెంటు కోతల రాజ్యం తెచ్చారని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే అధికంగా ఉంటే పరిశ్రమలెలా వస్తాయని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలకు రూ. 12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ట్రూ అప్ ఛార్జీల పేరిట ఆ భారాన్ని ప్రజలపై మోపటం తగదని హితవు పలికారు.
సొంత సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లు..
తెదేపా ప్రభుత్వం హయాంలో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసుకున్న సౌర, పవన విద్యుత్ ఒప్పందాలను.. అధికారంలోకి రాగానే రద్దు చేసిన ఫలితమే విద్యుత్ కోతలకు కారణమని అన్నారు. సీఎం జగన్ రెడ్డి బినామీ పేర్లతో సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నడుపుతున్న విద్యుత్ కేంద్రాల నుంచి యూనిట్ విద్యుత్ రూ. 20 కి కొనుగోలు చేస్తూ.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేసే దిశగా తీసుకెళ్లారని మండిపడ్డారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బదులుగా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయటం వెనుక తాడేపల్లి చీకటి వ్యాపారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా వచ్చాక ప్రజలకు కరెంటు ధరల షాక్..
అప్పుల కోసం దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైకాపా పెద్దలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ రాబట్టలేకపోతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రజలు ఇంట్లో లైటు, ఫ్యాను వేయాలన్నా భయపడే విధంగా ఛార్జీలు పెంచారంటూ మండిపడ్డారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు, కర్నూలు సౌర విద్యుత్ పార్క్, అనంతపురం పవన విద్యుత్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రశ్నార్థకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకునేందుకు ఫ్యాన్లు, ఏసీల వినియోగం ఆపాలని అధికారికంగా ప్రకటించటంతో పాటు.. పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేసి రాష్ట్ర ప్రగతిని కుంటుపడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని సాంతం ఊడ్చేసి జేబులు నింపుకోవటం అత్యంత హేయమని అన్నారు.
ఇదీ చదవండి: