వైకాపా ప్రభుత్వం అమరావతిలో కులగణన జరపాలని తెదేపా అధికార ప్రతినిధి గంజి చిరంజీవి సవాల్ చేశారు. రాజధాని ప్రాంతంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో.. లెక్కలు తేల్చేందుకు రావాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు 32 శాతం, రెడ్డి సామాజిక వర్గం 23 శాతం, కమ్మ సామాజికవర్గం 18 శాతం, బీసీలు 14 శాతం, కాపులు 9 శాతం, 3 శాతం మైనార్టీలు ఉంటే ఒక శాతం ఇతర కులాల వాళ్లున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి తన వ్యక్తిగత, రాజకీయ కక్షలతో అమరావతిని నాశనం చేస్తూ.. రైతులను కించపరిచేలా కులం ఆపాదించటం దుర్మార్గమన్నారు.
అమరావతి పవిత్ర స్థలం: వర్ల
అమరావతి ప్రాంత ప్రజలను కించపరిచే రీతిలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హితవు పలికారు. అమరావతి తెలుగు వైభవ శోభిత ప్రాంతంగా, శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన ప్రదేశమని గుర్తు చేశారు.
'కేంద్రం నిధులిచ్చే పథకాలనే అమలు చేస్తారా?'
విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. 637 కళాశాలల్లో 70 వేల మంది పీజీ విద్యార్ధుల పాలిట ఈ ఉత్తర్వులు యమపాశంగా మారాయని మండిపడ్డారు. రెండేళ్లు గడవకుండానే జగన్, తాను ప్రవేశపెట్టిన పథకాలను తానే రద్దుచేశారని ఆక్షేపించారు. రాష్ట్రంలో అన్ని పథకాలను రద్దు చేసి కేంద్రం నిధులిచ్చే పథకాలను మాత్రం అమలు చేస్తాననే విధంగా సీఎం వ్యవహరించటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: