దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం తగదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సినేషన్ కోసం నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవని చెప్పడం దారుణమని ఆక్షేపించారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదన్న చంద్రబాబు.. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.
సాయం అందించేలా చర్యలు...
'కరోనా వేళ అవసరమైన సమాచారం' పేరిట ఆన్లైన్లో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్వరరావు సహాయంతో 200మందికి పైగా బాధితులకు వైద్య సాయం అందించామని, పడకలు, ఆక్సిజన్ లభించని క్లిష్ట పరిస్థితుల్లో సాయం అందించే విధంగా చర్యలు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.
ఉత్తమ విధానాలు అందించేందుకు...
ప్రజలకు ఉత్తమ విధానాలు అందించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్న చంద్రబాబు... రెండో దశలో 20 ఏళ్లు పైబడిన వారిపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. మూడో దశలో చిన్నారులపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: