విజయవాడలో తెదేపా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా.. అగ్ర నేతలు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల కోత, 3 రాజధానుల అంశంపై ప్రజలను కలవనున్నారు. అలాగే.. ఇసుక, భూములు, గనుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
45 రోజుల పాటు.. ప్రతి నియోజకవర్గంలో..
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీల ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ప్రజాచైతన్య యాత్రలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర పూర్తి చేయాలని పార్టీ శ్రేణులను అధినేత చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ పర్యటనపై త్వరలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తేదీ ఖరారు చేయాలని భావిస్తున్నారు. మండలి రద్దు, ఇతర అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
దాడులు, కేసులపై నేతలకు అండగా...
తమపై జరుగుతున్న దాడులు, కేసుల విషయాన్ని చంద్రబాబు దృష్టికి పలువురు నాయకులు తీసుకువచ్చారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకే ఇలా వేధిస్తున్నారని ఆవేదన చెందారు. బాధితులకు పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.