రాష్ట్రంలో గిరిజనులు వివక్షకు గురవుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ దొన్నుదొర.. జాతీయ ఎస్టీ కమిషన్‌కు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గిరిజన వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఇతర ఆదివాసీ నాయకులను ప్రభుత్వ అధికారే అవమానించారని పేర్కొంటూ లేఖలు రాశారు. రంపచోడవరం ఐటీడీఏ పీవోపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను దేశంలోని ఆదివాసీల సాధికారికత కోసం ఏర్పాటు చేశారని.. కానీ ఏపీలో అధికార వైకాపా ప్రభావంతో ఐటీడీఏ ఇందుకు విరుద్దంగా పని చేస్తోందని ఆరోపించారు.
కాగా.. ఈ నెల 23న ఆదివాసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పలువురు ఆదివాసీ నేతలతో కలిసి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యకు పలు సమస్యలపై వినతులిచ్చేందుకు వెళ్లారు. తన చాంబర్‌లో కుర్చీలో కూర్చున్న సదరు అధికారి వారిని లోపలికి పిలిచి పోలీసుల ముందే నేలపై కూర్చోబెట్టారు. అయినా వారు తమ సమస్యలను పీఓకు వివరించారు. కానీ అధికారి అవేమీ పట్టించుకోలేదు. సమగ్ర విచారణ చేసి సదరు అధికారిపై చర్యలు తీసుకోగలరని ఆ లేఖల్లో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: JAGANA TOUR: కుటుంబ సమేతంగా సీఎం షిమ్లా పర్యటన