Taskforce Chairman Krishnababu: ఉక్రెయిన్‌లో గుర్తించిన భారత విద్యార్థులందర్నీ ఈ నెల 9 నాటికి స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామని ఏపీలోని ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఉక్రెయిన్‌లో గుర్తించిన 770 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 429 మందిని స్వదేశానికి తీసుకొచ్చామని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్‌ను కేంద్రం నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిని స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర విదేశాంగశాఖ సహకారంతో పని చేస్తోందన్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, గన్నవరం తదితర విమానాశ్రయాలకు చేరుకుంటున్న వారిని స్వస్థలాలకు పంపుతున్నామని చెప్పారు. హంగరీ, రొమేనియా, స్లొవేకియా సరిహద్దు ప్రాంతాలకు ఎక్కువగా విద్యార్థులు వస్తున్నారని.. ఆయా దేశాల్లోని భారతీయులు, తెలుగు సంఘాల సాయంతో వారిని వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కృష్ణబాబు వివరించారు.
రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరిని రప్పించేందుకు కృషి చేస్తాం...
క్లిష్ట పరిస్థితులున్న ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులను రప్పించేందుకు ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలతో విదేశాంగశాఖ మాట్లాడుతోందని పేర్కొన్నారు. బుడాపెస్ట్‌లో 2 వేల మంది భారతీయులకు విదేశాంగశాఖ వసతి కల్పించిందని తెలిపారు. వీరిలో నుంచి శనివారం రోజు 1,100 మందిని స్వదేశానికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారని అన్నారు. సరిహద్దుకు చేరుకున్న వారికి వసతి కల్పించలేనప్పుడు ..అలాంటి వారందర్నీ వెంటనే స్వదేశానికి తీసుకొస్తున్నారని కృష్ణబాబు స్పష్టం చేశారు. అంతే తప్ప వెనక వచ్చినోళ్లను ముందుగా తీసుకొస్తున్నారని భావించొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఏపీకి చెందిన చివరి విద్యార్థినీ వెనక్కి తీసుకొచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. 770 మంది ఏపీ విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తమ వద్ద పేర్లు నమోదయ్యాయని...మరో 200 మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించినందున త్వరితగతిన ఏపీ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విదేశాంగశాఖ మాజీ అధికారి గితేశ్ శర్మ అన్నారు. ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులు ఇంకెవరైనా చిక్కుకుని ఉంటే వారి వివరాలను 1902 కాల్ సెంటర్‌కు తెలియజేయాలని తల్లిదండ్రులకు టాస్క్‌ఫోర్స్ కమిటీ అధికారి బాబు.ఎ. సూచించారు.
ఇదీ చదవండి: ఉక్రోషంలో ఉక్రెయిన్ సైన్యం...స్వస్థలానికి చేరుకున్న విద్యార్థిని వెల్లడి