ఏప్రిల్ 2021 నుంచి పట్టణాల్లోని ప్రజలపై తాగు, మురుగునీటి పన్నుల భారం పెరగనుంది. ప్రస్తుతం విజయవాడలో తాగునీటి నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఏడాది 7% పన్ను పెంచుతున్నారు. ఇంత మొత్తంలో పెంచుతున్నా నిర్వహణకు సరిపడా ఆదాయం రావడం లేదని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. పూర్తి స్వయం సమృద్ధి సాధించేందుకు 15% వరకు ఛార్జీలను పెంచుకోవచ్చు. ఇదే అమలైతే నగరవాసులపై రెండింతల భారం పడే అవకాశముంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం...
* తాగునీటి సరఫరా విభాగంలో ఇప్పటికే స్వయం సమృద్ధి సాధిస్తున్న సంస్థలు ప్రతి ఏటా 5% రుసుం పెంచుకోవచ్చు. ఈ పన్నులను గృహాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలుగా విభజించారు.
* ప్రస్తుతం ఉన్న యూజర్ ఛార్జీలను 15% వరకు పెంచుకోవచ్చు.
ఎన్ని మరుగుదొడ్లు ఉంటే... అంత పన్ను!
పట్టణాల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న మురుగునీటి పన్నులు.. నిర్వహణ ఖర్చుల కంటే తక్కువగా ఉన్నాయని, ఈ లోటును పూడ్చేందుకు వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరుగుదొడ్ల (సీట్లు) కనెక్షన్ ఆధారంగా పన్నులను నిర్ణయించారు. పురపాలక, నగరపాలికల్లో తీర్మానం చేసుకొని, ప్రతి సంవత్సరం 5% పన్నులను పెంచుకునే అవకాశం కల్పించారు.
ఇదీ చదవండి: నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి