స్వర్ణప్యాలెస్ హోటల్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ బాబు కస్టోడియల్ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు ఈ కేసు దర్యాప్తు అధికారి అదనపు డీసీపీ ఎదుట హాజరుకావాలని రమేష్ బాబుకు సూచించింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అదనపు డీసీపీ కార్యాలయంలో విచారణ జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు.
రమేష్ బాబు తరఫు న్యాయవాది సమక్షంలో కస్టోడియల్ విచారణ జరపాలని అందులో వివరించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా కస్టోడియల్ విచారణ సమయంలో భౌతికదూరం పాటించటం, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారికి సూచించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించటం, అర్థ రహిత ప్రశ్నలు వేయటం చేయొద్దని, మానవ హక్కులకు లోబడి విచారణ హుందాగా సాగాలని తీర్పులో ప్రస్తావించారు.
ఇదీ చదవండీ... జనవరి నాటికి పంట నష్ట పరిహారం చెల్లించాలి: సీఎం