ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిల విషయంలో రైతులను బలి చేసేలా మంత్రి బొత్స వ్యాఖ్యలు ఉన్నాయని తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. బకాయిల కోసం ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి.. జైల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బకాయిల కోసం నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా.. పట్టించుకోని జగన్ రెడ్డి నేడు వారిని నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బొత్స హామీలను నమ్మే పరిస్థితుల్లో చెరకు రైతులు లేరని స్పష్టం చేశారు.
వైకాపా వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెదేపాపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీఎస్ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తక్షణమే రైతులకు రూ.16.33 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ ఆయన చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. బకాయిలు అడిగితే దాష్టీకానికి పాల్పడటమే కాకుండా అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేయాలనుకోవడం అమానుషమని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక చర్యలను ప్రజానీకం గమనిస్తోందని వెల్లడించారు.
ఇదీ చదవండి: AP IIC: తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కును సందర్శించిన ఏపీ ఐఐసీ బృందం