రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావ్యది. అనంతపురంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హఠాత్తుగా జరిగిన ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు పోయాయి. దీంతో ఆమె జీవితం అంధకారంలోకి వెళ్లింది. దీనిపై 'ఈటీవీభారత్'లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి సుదీక్షణ్ ఫౌండేషన్ స్పందించింది. కావ్యకు రెండు కృత్రిమ కాళ్లను అమర్చారు. ఆమెతో పాటు రైలు, రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన మరో ముగ్గురికి కృతిమ అవయవాలను పంపిణీ చేసింది సుదీక్షన్ ఫౌండేషన్. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా భాదితులకు కృతిమ అవయవాలను అందజేశారు.
నమ్మకం కలిగింది: కావ్య, బాధితురాలు
ఎవరో చేసిన తప్పుకు తాము బలైపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోవటంతో తమ జీవితాలు చీకట్లోకి నెట్టివేయబడ్డాయని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో... 'ఈటీవీభారత్' కథనం ప్రచురితమైంది. సుదీక్షణ్ ఫౌండేషన్ ప్రతినిధులు తమను సంప్రదించారని, సాయం చేసేందుకు ముందుకొచ్చారని బాధితురాలు కావ్య తెలిపింది. సుదీక్షణ్ ఫౌండేషన్ తమ జీవితాలను నిలబెట్టిందని.. తమ కాళ్లపై తాము నిలబడగలమనే నమ్మకం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యువత అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన జీవితాలు కోల్పోతున్నారని సుదీక్షణ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు విమల ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు .
ఇదీ చదవండి : 'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'