విజయవాడకు చెందిన షైనీ, ఏకే నాయుడు అక్కా తమ్ముళ్లు. నాయుడు డిగ్రీతో చదువు ఆపేశారు. షైనీ పీజీ పూర్తి చేశారు. ఇంటర్లో సీఈసీ గ్రూప్ తీసుకుంటే షైనీని స్నేహితులు హేళన చేశారు. దృఢమైన ఆలోచనతో ఉన్న ఆమె.. ఎప్పుడూ నిరాశ చెందలేదు. పారిశ్రామికవేత్త కావాలన్న కల కోసం ఎంకామ్ వరకు చదివారు. మధ్యలో పెళ్లి, పిల్లలతో కొంత విరామం వచ్చినా... లక్ష్యాన్ని మరచిపోలేదు. ఆర్మీలో పనిచేసే భర్త మద్దతు...తమ్ముడి తోడుతో షైన్ వాక్ పరిశ్రమ స్థాపించారు.
వ్యాపారంలో రాణించేందుకు అక్కా తమ్ముడు ఆరునెలలు నిద్రాహారాలు మాని శ్రమించారు. మార్కెట్లో ఉన్న బ్రాండ్లేంటి? వేటికి ఆదరణ ఉంది? మన్నిక, ధర, వినియోగదారుల అభిరుచులు పరిశోధించారు. అలా శోధించిన సమాచారంతో కృష్ణాజిల్లా సూరంపల్లిలోని ఎలీప్ పరిశ్రమల సముదాయంలో షైన్ వాక్ కంపెనీ స్థాపించారు.
ఇతర రాష్ట్రాలకూ ఎగుమతులపై దృష్టి..
చెప్పుల ఆకృతుల నుంచి ఉత్పత్తి పూర్తై బయటకు వచ్చే వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షైన్ వాక్ చెప్పులు తయారు చేస్తున్నారు. నైపుణ్యం కలిగిన 20 మందిని నియమించుకొని వినియోగదారులను మెప్పించే సరకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన వీరి అమ్మకాలు ఇతర్రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
30 రకాల డిజైన్లు తయారీ..
ఐక్యంగా పని చేయడమే తమ విజయరహస్యమని చెబుతున్నారు షైనీ. తమ్ముడు ఏకే నాయుడు పరిశ్రమ నిర్వహణ, తయారీపై దృష్టి పెడితే... అకౌంటింగ్, మార్కెటింగ్, ముడి సరుకుల దిగుమతిని షైనీ చూస్తున్నారు. 30 రకాల ఆకృతులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న యంత్రాలు వీరి వద్ద ఉన్నాయి. ప్రస్తుతానికి 12 రకాల ఆకృతుల్లోనే చెప్పులు ఉత్పత్తి చేస్తున్నారు.