రాష్ట్రంలో రాయితీపై ఉల్లి విక్రయాలను ఇవాళ్టి నుంచి రైతుబజార్లకే పరిమితం చేస్తున్నారు. మార్కెట్ కమిటీల్లో సబ్సిడీ ఉల్లి ఇక ఉండబోదు. నేడు విజయవాడకు ఈజిప్టు ఉల్లి చేరుతోంది. ఒకటి రెండు రోజుల్లో విశాఖపట్నంలోనూ విక్రయాలు మొదలవుతాయి. మిగిలిన రైతుబజార్లకూ కడప నుంచి కేపీ రకం ఉల్లిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరగడం వల్ల రాష్ట్రంలోనూ కిలో రూ.200 వరకు చేరాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం కిలో రూ.25 చొప్పున రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ 70 వేల క్వింటాళ్ల ఉల్లిని వినియోగదారులకు అందించారు. మహారాష్ట్రలోని శోలాపుర్, లాసల్‌గావ్‌తోపాటు హైదరాబాద్, తాడేపల్లిగూడెం, కర్నూలు, కడప మార్కెట్ల నుంచి తెప్పించి పంపిణీ చేశారు. వీటి బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల నాలుగైదు రోజులుగా సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతుబజార్ల చుట్టూ తిరిగి వెళ్తున్నారు.
ఇవాళ్టి నుంచి పంపిణీ..
కేంద్రం ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఉల్లిలో 28 టన్నులు నేడు విజయవాడకు చేరనున్నాయి. వీటిని కిలో రూ.25 చొప్పున అందించనున్నారు. కడప జిల్లాలో పండే కేపీ రకం ఉల్లిని రోజుకు 50-60 టన్నుల చొప్పున మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లకు తరలించి అమ్మకాలు చేపట్టనున్నారు. సాధారణ రకంతో పోలిస్తే ఇవి చిన్నవి, ఘాటు ఎక్కువ. వీటిపై వినియోగదారులు అంత ఆసక్తి కనబరచకపోవడం వల్ల ధర తగ్గించి పంపిణీ చేసే అంశాన్ని మార్కెటింగ్ శాఖ పరిశీలిస్తోంది.
సంక్రాంతికి తగ్గేనా..?
ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. మధ్యతరగతి వినియోగదారునికి అందే స్థాయికి చేరలేదు. ఇంకా కిలో రూ.100 చొప్పునే విక్రయిస్తున్నారు. చిన్నవైతే కిలో రూ.60-80 చొప్పున లభిస్తున్నాయి. సంక్రాంతికి ధరల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చూడండి: