గొర్రెలు, మేకల పెంపకానికి హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ జహీరుద్దీన్ అనే విశ్రాంత అధికారి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్‌ను రూపొందించారు. ‘షీప్ అండ్ గోట్ అకాడమీ’ పేరిట 2012, నవంబరులో ఓ ఛానల్ రూపొందించాడు. దానిలో పెడుతున్న వీడియోలకు పెంపకందారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
187 వీడియోలు..
శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెలు, మేకలను పెంచడం, వాటి ద్వారా ఆదాయం పొందడం, మార్కెటింగ్ తదితర అంశాలపై తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, అరబిక్ భాషల్లో 187 వీడియోలు తీసి ఛానల్‌లో పెట్టారు. వాటిని ఇప్పటి వరకు 94.67 లక్షల మంది వీక్షించారు. రాష్ట్ర సహకార శాఖలో సహాయ రిజిస్ట్రార్‌గా పదవీ విరమణ పొందిన ఆయన వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కి చెందిన గొర్రెల పరిశోధన సంస్థలో గొర్రెలు, మేకల పెంపకంపైన శిక్షణ తీసుకున్నారు.
మరింత ఆదరణ
పెంపకం తీరుపై ఓ వైపు యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలను పెడుతూనే మరోవైపు పెంపకందారులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైన తరవాత ఈ వీడియోలకు మరింత ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో గొర్రెలు, మేకల మాంసానికి డిమాండు ఉన్న దృష్ట్యా నిరుద్యోగులు వంద గొర్రెలు, మేకలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచితే ఏటా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని వివరించారు. దేశంలో అధిక గొర్రెలు తెలంగాణలో ఉన్నా... వాటి సంఖ్యను మరింత పెంచడానికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు.
ఇవీ చూడండి: కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు!