వర్షం వచ్చిందంటేనే.. బెజవాడ బెంబేలెత్తిపోతుంది. ప్రధానంగా నగరంలోని పల్లపు ప్రాంతాలు, రహదారులు మునిగిపోతున్నాయి. డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు, ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. అసంపూర్తిగా ఉన్న వర్షపునీటి డ్రెయిన్లే ఇందుకు అసలు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ. 461 కోట్ల వ్యయంతో 2017లో పనులు చేపట్టాలరు. నాలుగేళ్లయినా 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షపునీటి డ్రెయిన్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. నగరంలోని మెజారిటీ డివిజన్లలో సగటున 7కిలోమీటర్లు కూడా వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తికాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.
నగరంలో కొన్నిచోట్ల వర్షపునీటి డ్రెయిన్ల నిర్మాణానికి అనువుగా రహదార్లు విస్తరించాల్సి ఉంది. అయితే న్యాయస్థానాల్లో కేసులు ఇబ్బందిగా మారాయి. ఇక రైల్వేశాఖ, నేషనల్ హైవే ఆథారిటీ, ఆర్‌అండ్‌బీ విభాగాల నుంచి నిర్మాణాలకు అవసరమైన అనుమతుల్లో జాప్యం కూడా సమస్యలను అధికం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను త్వరగా పూర్తిచేసి ముంపు సమస్యల నుంచి విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి...