సలావుద్దీన్ ఒవైసీ
రాజకీయ ఉద్దండుడిగా, వ్యూహకర్తగా, ఎంఐఎంను పాతబస్తీలో తిరుగులేని స్థితిలో నిలిపిన నేతగా సలావుద్దీన్ గుర్తింపు పొందారు. తండ్రి అబ్దుల్ వాహెద్ ఒవైసీ మరణం తర్వాత మజ్లిస్ పగ్గాల్ని చేపట్టారు. 1960లో మల్లేపల్లి డివిజన్ నుంచి గెలిచి కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అనంతరం ఐదుసార్లు ఎమ్మెల్యే, ఆరు సార్లు ఎంపీగా గెలిచి రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆయన తనయులు అసదుద్దీన్‌ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉండగా, అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్
ప్రస్తుతం మంత్రిగా ఉన్న తలసాని రాజకీయ జీవితం ఒకప్పుడు కార్పొరేటర్‌గా పోటీ చేయడం ద్వారానే ప్రారంభమైంది. 1986లో మోండామార్కెట్ నుంచి జనతాదళ్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. 2004లో ఓటమి చెందగా, 2008 ఉప ఎన్నిక, 2014 జనరల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పార్టీలో చేరారు. గత, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
డాక్టర్ కె.లక్ష్మణ్
భాజపా కీలక నేతల్లో లక్ష్మణ్ ఒకరు. ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. ఈయన రాజకీయ జీవితం కార్పొరేటర్ నుంచే ప్రారంభమైంది. 1986లో జవహర్‌నగర్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రేణుకాచౌదరి
ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్లో రేణుకాచౌదరి ఒకరు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తన రాజకీయ జీవితం 1986లో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గా గెలవడంతో ప్రారంభమైంది.
పద్మారావు
ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఉన్నారు. 2002లో మోండా మార్కెట్ నుంచి బల్దియాకు ఎన్నికయ్యారు. 2004లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2014లో మరోసారి గెలిచి మంత్రిగా పనిచేశారు. 2019లోనూ విజయం సాధించారు.
ముఖేశ్‌గౌడ్
నగర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న నేతల్లో ముఖేశ్‌గౌడ్ ఒకరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన తొలుత కార్పొరేటర్ స్థాయి నుంచే వచ్చారు. 1986లో జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.
మరికొందరు...
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి: ప్రస్తుతం ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్‌రెడ్డి ఒకప్పుడు కార్పొరేటర్‌గా పనిచేశారు. 1986 మున్సిపల్ ఎన్నికల్లో మూసారంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు.
ముంతాజ్‌ఖాన్: ప్రస్తుతం చార్మినార్ ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్‌ఖాన్ 1986లో జరిగిన ఎన్నికల్లో రియాసత్‌నగర్ కార్పొరేటర్‌గా ఉన్నారు.
అహ్మద్‌బలాల: ప్రస్తుతం మలక్‌పేట ఎమ్మెల్యేగా ఉన్న బలాల 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
సాయన్న: ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పి.సాయన్న 1986లో జరిగిన బల్దియా ఎన్నికల్లో దోమల్‌గూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తీగల కృష్ణారెడ్డి: ఈయన మాజీ మేయర్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలుత మూసారంబాగ్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.
సయ్యద్ సజ్జాద్: 1989, 1999లో ఎంఐఎం తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన సయ్యద్.. అంతకుముందు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
పి.రామస్వామి: మహరాజ్‌గంజ్ నుంచి 1983లో ఎమ్మెల్యేగా గెలిచిన రామస్వామి.. 1964లో గౌలిగూడ కార్పొరేటర్‌గా ఉన్నారు.
కృష్ణాయాదవ్: రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన కృష్ణాయాదవ్ రాజకీయ జీవితం 1986లో గౌలిపురా కార్పొరేటర్‌గా ప్రారంభమైంది.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న జీహెచ్ఎంసీ నామినేషన్లు పర్వం