జమ్ముకశ్మీర్ మాచిల్ సెక్టార్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మహేశ్ మృతితో స్వగ్రామం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ భద్రత కోసం మహేశ్ ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉన్నా.. అతనితో ఎంతో భవిష్యత్ ఊహించిన తనకు.. ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నట్లు భార్య సుహాసిని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలన్న తపనతో ఉండేవాడని... తనకు తెలిస్తే వద్దంటానని ఎంపికయ్యే వరకు విషయం చెప్పలేదని.. తల్లి రాజవ్వ విలపించింది. దేశసేవలోనే ఉంటాడనుకున్న తమ కుమారుడు... అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో మహేశ్ తండ్రి కుమిలిపోతున్నారు. చిన్న వయస్సులోనే కుమారుణ్ని పోగోట్టుకోవడం తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం..
ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవానుకు నేతలు నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మహేశ్‌కు నివాళులర్పించిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి... కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాను మహేశ్ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడూతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కశ్మీర్ సరిహద్దుల్లో శత్రువుల దాడి నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తనను తాను అర్పించుకున్నాడని... మహేశ్‌కు యావత్ తెలంగాణ సమాజం అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తోందని తెలిపారు.
సైనికుడి త్యాగం మరవలేనిది..
సరిహద్దులో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మహేశ్‌కు మంత్రి కేటీఆర్ ఘననివాళి అర్పించారు. సైనికుడి త్యాగం మరవలేనిదన్న కేటీఆర్.. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జవాను మృతిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపంప్రకటించారు. వీరమరణం పొందిన జవానులకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. మహేశ్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పరామర్శించారు.
ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మహేశ్ భౌతికకాయం... మంగళవారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుందని అధికారులు వెల్లడించారు
ఇదీ చదవండి: వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది : సీఎం జగన్