విజయవాడ నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రతి స్తంభానికి అందమైన సీసీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అన్ని రోడ్లు, అన్ని వైపుల నుంచి వచ్చే వారిని గమనించేలా వాటిని ఏర్పాటు చేశారు. వాటిలో ఎన్ని సక్రమంగా పని చేస్తున్నాయంటే.. చెప్పడం ఎవరితరం కాదు. అవి కనీస మరమ్మతులకు నోచుకోక అలంకార ప్రాయంగా మారాయి. నగరంలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 907 సీసీ కెమెరాలు బిగించారు. వీటిని బీవోడీ(బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ఐవీస్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీటి నిర్వహణ బాధ్యతను పోలీసుశాఖ చూస్తోంది. వీటి నిర్వహణ కోసం రూ.2కోట్లు అవసరమని అంచనా వేసిన పోలీసులు.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇటీవల మరోసారి నిధులు మంజూరు చేయాలని సీపీ బత్తిన శ్రీనివాసులు కోరారు. దీనికి స్పందనగా.. రూ.2కోట్లు ఇవ్వడం సాధ్యం కాదని, రూ.75 లక్షలకు అంచనా వేసి మళ్లీ పంపితే చూస్తామని చెప్పడంతో అధికారులు సవరించిన నివేదికను మళ్లీ పంపించారు. ఇవి మంజూరైతే కొంతమేర పరిస్థితి మెరుగవుతుందని పోలీసులు భావిస్తున్నారు.
50 శాతం.. అలంకారప్రాయం
విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు.. వీఐపీల పర్యటనలు, ట్రాఫిక్ సమస్యలు, ఈ-చలానాల జారీ, అల్లర్లు తదితర అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. నగర పోలీసులకు ఎన్నో కేసుల పురోగతిలో ఇవీ కీలక ఆధారాలను అందించాయి. గత రెండేళ్లలో 300 కేసులను ఛేదించడంలో ఇవీ ప్రముఖపాత్ర పోషించాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది. రోడ్లపై ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించడం ఎప్పుడో ఆపేశారు. విద్యుత్తు సరఫరా లేకపోవడం, డీవీఆర్ బాక్సులకు ఇచ్చిన కనెక్షన్ కేబుళ్లు ఊడిపోవడంతో సీసీ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు నిక్షిప్తం కావడం లేదు. ఫలితంగా నిందితులను గుర్తించడం, సాక్ష్యాలు సేకరించడం ఇబ్బందిగా ఉందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీపీకి వివరించారు.
ఒక్కో స్టేషన్ పరిధిలో.. 500లకు పైగా నోటీసులు
అంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ(మేసర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్-2013 ప్రకారం నగరంలో కనీసం వంద మంది తిరిగే ప్రాంతాలైన వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, మతపరమైన స్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే, బస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ 30 రోజులకు సంబంధించిన ఫుటేజీలను భద్రపరచాలి. ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసు అధికారులు అడిగనప్పుడు ఆ వీడియోలను చూపించాలి. చాలా మంది వీటిని అమర్చుకోలేదు. కొంతమంది తక్కువ సామర్థ్యం ఉన్నవి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో అవి ఉన్నా నేరస్థులను గుర్తించేందుకు ఉపయోగపడడం లేదు. ఉదాహరణకు విజయవాడ మధ్య డివిజన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అవి 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్నవి. ఆ హోటల్ సమీపంలో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. ఆ గొలుసు దొంగతనం చేసిన వ్యక్తి వెళ్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కానీ.. అతని మొహం, వాహనం నంబరు మాత్రం కనిపించలేదు. దీంతో ఎక్కువ పిక్సెల్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆ హోటల్‌కు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇలా ఒక్కో స్టేషన్ పరిధిలో దాదాపు 500 హోటళ్లు, దుకాణాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం పరిస్థితి మారింది. గతేడాది మూడు అవార్డులు అందుకున్న ఇంటిగ్రేటెడ్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ మానిటరింగ్ సెంటర్’ నిరుపయోగంగా మారింది. దీనికి కారణం నగరంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడమే. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆధారం కోసం కంట్రోల్‌రూంని ఆశ్రయిస్తున్న పోలీసులకు నిరాశ ఎదురవుతుంది. ప్రమాదాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితుల ఆచూకీని, ఆనవాళ్లను గుర్తించడం కష్టతరంగా మారింది.
- ఇటీవల జరిగిన ఓ సమావేశంలో పలు స్టేషన్ల అధికారులు సీపీ ఎదుట వ్యక్తం చేసిన ఆవేదన ఇది
‘నేరగాళ్లను సులభంగా గుర్తించేందుకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. నగరంలోని అన్ని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటన్నింటిని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశార. ఈ వ్యవస్థ ఆధారంగా అటు నేరస్థుల కట్టడి, ఇటు ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించవచ్ఛు’
-ఇదీ మొన్నటి వరకు అధికారులు చెబుతున్న మాటలు
ఇదీ చదవండి