ప్రభుత్వ అవినీతిని, అక్రమాల్ని ప్రశ్నించిన విపక్ష నాయకుల్ని అక్రమ కేసులు, సంకెళ్లతో అణచివేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ముసుగేసి... రౌడీల్ని పిలిపించి కొట్టించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డాక్టర్లతో తప్పుడు రిపోర్టు ఇప్పించారు. ఎంపీకి దెబ్బలు తగలడం వాస్తవమని సుప్రీంకోర్టే తేల్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాతైనా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.
- తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు డిమాండ్
ఓటు బ్యాంకు రాజకీయాలు మా విధానం. వాటి కోసమే పథకాలు ప్రవేశపెడతాం. ప్రజలకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తూ ఉంటాం. మేం అధికారంలో కొనసాగుతుంటాం. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు మాకు అనవసరం. మాకు స్వల్ప కాలంలోనే లబ్ధి ఎలా చేకూరుతుందన్నదే మా ప్రభుత్వం, నాయకుడి ఆలోచనా విధానం. ఆ దిశగానే బడ్జెట్ ప్రవేశపెట్టాం. ప్రతిపక్ష సభ్యులు ప్రతిదానికీ శ్వేతపత్రం విడుదల చేయమంటే కుదరదు.
- తెదేపా మాక్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వ్యంగ్యాస్త్రాలు
ప్రభుత్వ వైఖరిపై నిరసనగా ఆన్‌లైన్‌లో చేపట్టిన మాక్ అసెంబ్లీని తెదేపా శుక్రవారం రెండో రోజూ కొనసాగించింది. వ్యవసాయం-రైతు సమస్యలు, పేద, మధ్యతరగతి ప్రజల వ్యతిరేక బడ్జెట్, ప్రతిపక్షాలపై దాడులు, ప్రభుత్వ అవినీతి... అనే అంశాలపై చేపట్టిన చర్చలో పాల్గొన్న సభ్యులు ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లోనూ... ఎన్నికల హామీల అమలు, దిశ బిల్లు, పింఛను పెంపు, ధరల పెరుగుదల వంటి... 20 అంశాల్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై... మంత్రులుగా వ్యవహరించిన నాయకులు వ్యంగ్యంగా సమాధానాలిచ్చారు. మాక్ అసెంబ్లీలో వివిధ అంశాలపై నేతలు చేసిన వ్యాఖ్యలు ఇవి..!
అప్పులు తీర్చడానికే రుణాలు తేవాల్సొస్తుంది: యనమల
‘‘ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే... భవిష్యత్తులో వాటిని తీర్చడానికి, వడ్డీలు కట్టడాఏడాదికి రూ.లక్ష కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. రెండేళ్లలో ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసింది. మొత్తం అప్పులు రూ.4.47 లక్షల కోట్లకు చేరాయి. భవిష్యత్తులో అప్పులు తీర్చడానికే రుణాలు తీసుకు రావలసిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు. రాష్ట్రంలో వృద్ధి రేటు -2.58గా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అది -5 శాతానికి చేరే అవకాశముంది. ద్రవ్యలోటు కూడా 5% కంటే ఎక్కువ ఉంది’’ అని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడారు.
విశాఖ ఉక్కుపై మొక్కుబడి తీర్మానమా?
మాక్ అసెంబ్లీ మొదలైన వెంటనే సభాపతిగా వ్యవహరించిన డీబీవీ స్వామి ప్రశ్నోత్తరాల్ని ప్రారంభించగా.. లోకేష్ జోక్యం చేసుకుని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, చర్చించాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దాన్ని కాపాడేందుకు రాష్ట్రం మొక్కుబడి తీర్మానం చేసి కేంద్రానికి పంపించటం సరికాదు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఐకాస పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇస్తూ సభ తీర్మానాన్ని ఆమోదిస్తోంది’’ అని తీర్మానం చదివి వినిపించారు. దీనిపై పీవీజీఆర్ నాయుడు (గణబాబు) మాట్లాడారు.
రైతులకు హక్కు లేకుండా చేస్తున్నారు: కేశవ్
‘‘రైతుల పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందనే ముసుగులో... వారికి పెట్టుబడి రాయితీ గురించి అడిగే హక్కు లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఉత్పత్తుల్ని రోడ్డున పడేసే పరిస్థితులున్నా... ఆ సమస్యలపై కనీసం ఒక్క గంటసేపైనా చర్చించేందుకు ప్రభుత్వానికి ఎందుకు మనసు రాలేదు?’’ అని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై నిమ్మల రామానాయుడు మాట్లాడారు.
ఎంపీని కొట్టడం సీఎం లైవ్‌లో చూశారంటున్నారు: లోకేశ్
‘‘మిమ్మల్ని వ్యతిరేకిస్తే సొంత పార్టీ ఎంపీనే కొడతారా? ఆయన్ను కొట్టడాన్ని సీఎం లైవ్‌లో చూసారంటున్నారు. విద్యా సంస్థలు తెరవడంతోనే కరోనా విజృంభించింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి. లేకపోతే 80 లక్షల మంది విద్యార్థులు కరోనా బారినపడే ప్రమాదం ఉంది’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు తిరస్కరించినా మీరు మారరా?’’ అని మంత్రిగా వ్యవహరించిన బుద్ధా వెంకన్న అనడంతో... ‘‘ముందు మీ సీఎంని తాడేపల్లి రాజప్రాసాదం నుంచి బయటకు రమ్మనండి. ప్రజలే బ్లీచింగ్ పౌడర్ కొట్టి, పారాసెట్మాల్ వేస్తారు’’ అని లోకేశ్ బదులిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులున్నాయి. ఇది ఫాసిస్ట్ పాలనలా ఉంది. ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తున్నారు’’ అని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు.
రెండేళ్లలో 28 మంది తెదేపా నాయకులు, కార్యకర్తల హత్య: సత్యప్రసాద్
‘‘ఈ ముఖ్యమంత్రి శని, ఆదివారాలు పూర్తిగా వ్యాపారం గురించే ఆలోచిస్తారు. సోమవారం వాటిని అమల్లో పెట్టేందుకు సమయం వెచ్చిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో ప్రతిపక్షాలపై కేసులు పెట్టి, ఎలా అణచివేయాలన్న పనిలో ఉంటారు. శుక్రవారం ఆయనపై కోర్టుల్లో ఉన్న అవినీతి కేసుల గురించి ఆలోచిస్తారు. ప్రజల గురించి రోజుకి ఒక్క గంట ఆలోచించినా... ఈ రోజు కరోనా విలయతాండవం ఇలా ఉండేది కాదు. రెండేళ్లలో 28 మంది తెదేపా నాయకులు, కార్యకర్తల్ని హత్య చేశారు. 1,400 మందిపై అక్రమ కేసులు పెట్టారు’’ అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కులేదు: బుచ్చయ్య చౌదరి
‘‘వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, సాయిరెడ్డిలను సామంత రాజులుగా నియమించి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. తన అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న శ్రీలక్ష్మి వంటి అధికారుల్ని కీలక పోస్టుల్లో నియమించారు. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు’’ అని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యంతోనే నిత్యావసరాలైన కందిపప్పు, నూనెలు, బియ్యం తదితర ధరలు పెరిగిపోయాయని ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, అశోక్‌బాబు ధ్వజమెత్తగా... ఆ శాఖ మంత్రికి పేకాట ఆడటానికే సమయం సరిపోవట్లేదని బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.
మద్యం తయారీ నుంచి సీసాల రీసైక్లింగ్ వరకు దేన్నీ వదలడం లేదు: బీద రవిచంద్ర
‘‘క్విడ్‌ప్రోకోలో ప్రయోజనాలు పొందడంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్. ఆయనే సీఎం అయితే... రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మద్యంలో వచ్చే డబ్బు చాలదన్నట్టు, వాటి ప్యాకింగ్‌కి ఉపయోగించే అట్టపెట్టెలు, సీసాలు, మూతల తయారీ, రవాణాతోపాటు, ఖాళీ సీసాల్ని సేకరించి రీసైక్లింగ్ వరకు అన్నీ వైకాపా నేతలే చేస్తున్నారు’’ అని రవిచంద్ర ధ్వజమెత్తారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి దానికి తూట్లు పొడిచారని అచ్చెన్నాయుడు విమర్శించగా... 70 ఏళ్లుగా ఉన్న మద్యం బ్రాండ్లలో ఒక్కటి కూడా లేకుండా చేయడమే, తాము చేపట్టే మద్యనిషేధమని అధికార పార్టీ సభ్యుల్లా అభినయిస్తూ కేశవ్ వ్యాఖ్యానించారు.
‘‘దశలవారీ మద్య నిషేధం మా విధానం. అందుకేగా మద్యం కంపెనీలన్నింటినీ హోల్‌సేల్‌గా తీసుకుని మా వాళ్లకు అప్పగించాం. స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి కొత్త బ్రాండ్లు మాత్రమే ఉంచాం. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచలేం. అందుకే అక్కడ నడుం వంచుతున్నాం. ఇంటింటికీ మద్యం పథకం ప్రవేశపెడతాం. రేషన్ సరకులు ఎలాగూ పంపలేకపోయాం. ఆ బళ్లలో మందు సరఫరా చేస్తాం’’
- మాక్ అసెంబ్లీలో పౌరసరఫరాల మంత్రిగావ్యవహరించిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
‘‘రూ.16 వేల కోట్లతో కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.56 వేల కోట్లకు పెంచారు. మేమైతే రూ.8 వేల కోట్లతోనే కట్టేసేవాళ్లం’’
- నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యంగ్యమిది
ఇదీ చదవండి