పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై తనకు తెదేపా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాల్లో తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని.. ఈ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మేనిఫెస్టోలను వినియోగించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో తెలిపింది. పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడా రాజకీయ నాయకులు, లేదా జాతీయ నాయకుల పేర్లు లేదా ఛాయాచిత్రాలను వాడరాదని స్పష్టం చేసింది. వారి ఫొటోలు ఉన్న హ్యాండ్ బుక్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, బ్యానర్లు, జెండాలు మొదలైన ప్రచార సామగ్రిని ఉపయోగించడానికి అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకి లేదా స్థానిక కార్యకర్తలకు అనుబంధమైన ఎటువంటి ప్రచార సామగ్రిని ముద్రించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీ మద్దతును సూచించే టోపీలు, కండువాలు, కర్చీఫ్‌లు, వీడియోలు ఇతరత్రా వస్తువులను పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం తెలిపింది.
ఇదీ చదవండి: హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం