గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసమే రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో వర్కింగ్ జర్నలిస్టు సంఘం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన పాల్గొన్నారు. 2014 - 19 మధ్య బాధ్యతారహితంగా చంద్రబాబు పనిచేశారని సజ్జల విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. ఒక్క ఆదాయ వనరునూ సృష్టించకుండా అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
కేంద్రం సాయం అందించడం లేదు
8 నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని సజ్జల రామకృష్ణ అన్నారు. సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని సీఎం జగన్ నడిపిస్తోన్న తీరు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి అలాగే ఉందని... ఈ అంశంలో వారు చెప్పే కారణాలు వాస్తవం కాదన్నారు. హోదా కోసం వైకాపా పోరాడుతూనే ఉంటుందని... ఎప్పటికైనా మార్పు వస్తుందని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.